
న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకంలో లబ్ది పొందిన అనర్హుల నుంచి తిరిగి డబ్బు వసూలు చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తెలిపారు. మంగళవారం లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి 19 విడతలుగా రైతులకు రూ.3.68 లక్షల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసిందని ఆయన చెప్పారు.
పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019, ఫిబ్రవరిలో ప్రారంభించింది. స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి అర్హులైన రైతులకు ఏడాది రూ. ఆరు వేలను మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం ప్రారంభంలో స్వీయ ధ్రువీకరణ ఆధారంగా లబ్ధిదారుల పేర్ల నమోదుకు అనుమతించారు. ఇప్పటికే 100శాతం ఆధార్ సీడింగ్ పూర్తి చేశారు. ఆధార్, ఆదాయపన్ను శాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖల వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను ఏరివేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.